దావీదు గాతులో
10దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. 11ఆకీషు సేవకులు “ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా” అని అతని గురించి రాజుతో చెబుతుంటే, 12దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.
13అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.
14అది చూసి ఆకీషు రాజు “మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది, ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు? 15పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖంలో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా?” అని తన సేవకులతో అన్నాడు.


