ఎలీషా సిరియానులకు గుడ్డితనం కలుగజేశాడు

8తరువాత సిరియా దేశం రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. తన సేవకులతో ప్రణాళిక వేసి “ఫలానా చోట నా శిబిరం వేసి ఉంచుతాను” అని చెప్పాడు. 9కానీ దేవుని మనిషి ఇశ్రాయేలు రాజుకి కబురు పంపి “ఆ మార్గం గుండా వెళ్ళకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే సిరియా సైన్యం అక్కడకు రాబోతున్నారు” అని తెలియజేశాడు.

10ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఇలా ఆనేకసార్లు దేవుని మనిషి చేసిన హెచ్చరిక రాజును రక్షించింది. 11దీని వల్ల సిరియా రాజు మనసులో కలవరపడ్డాడు. తన సేవకులను పిలిచి “మనలో ఇశ్రాయేలు రాజుకు సహాయం చేస్తున్నదెవరో నాకు మీరు చెప్పరా?” అని అడిగాడు.

12కాబట్టి అతని సేవకుల్లో ఒకడు “నా ప్రభూ, రాజా, అలా కాదు. ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా ఇశ్రాయేలు రాజుకి మీరు మీ పడగ్గదిలో పలికిన మాటలు కూడా చెప్పేస్తాడు” అన్నాడు. 13అప్పుడు రాజు “వెళ్ళండి, ఆ ఎలీషా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. నేను మనుషులను పంపి అతణ్ణి పట్టుకుంటాను” అని జవాబిచ్చాడు. అప్పుడు వారు అతనికి “అతడు దోతానులో ఉన్నాడు” అని సమాచారమిచ్చారు.

14కాబట్టి రాజు దోతానుకి గుర్రాలనూ, రథాలనూ, భారీ సంఖ్యలో సైన్యాలనూ పంపించాడు. వారు రాత్రి వేళ వచ్చారు. ఆ పట్టణాన్ని నాలుగు వైపులా చుట్టుముట్టారు. 15దేవుని మనిషి దగ్గర పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాడు. పట్టణం చుట్టూ గుర్రాలూ, రథాలూ, పెద్ద సైన్యం మోహరించి ఉండటం చూశాడు. అప్పుడు ఆ పనివాడు “అయ్యో ప్రభూ, ఇప్పుడు మనమేం చేద్దాం?” అని దేవుని మనిషితో అన్నాడు. 16దానికి ఎలీషా “భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్నవాళ్ళ కంటే మన వైపు ఉన్నవాళ్లు ఎక్కువ మంది” అని జవాబిచ్చాడు.

17ఆ తరువాత ఎలీషా “యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.

18సిరియా సైన్యం ఎలీషాకి దగ్గరగా వచ్చారు. అప్పుడు ఎలీషా “ఈ సైన్యానికి గుడ్డితనం కలుగజెయ్యి” అని యెహోవాను ప్రార్థించాడు. ఎలీషా అడిగినట్టే యెహోవా వాళ్లకు గుడ్డితనం కలుగజేశాడు. 19అప్పుడు ఎలీషా వాళ్ళతో “మీరు వెళ్ళాల్సిన దారి ఇది కాదు. ఇది పట్టణమూ కాదు. మీరు వెదికే మనిషి దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను, నా వెనకాలే రండి” అని చెప్పి వాళ్ళను షోమ్రోను పట్టణంలోకి తీసుకు వెళ్ళాడు.

20వారు షోమ్రోనులోకి వచ్చిన తరువాత ఎలీషా “యెహోవా, వీళ్ళు చూడాలి. వీళ్ళ కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వాళ్ళ కళ్ళు తెరిచాడు. తాము షోమ్రోనులో ఉన్నామని వాళ్లకర్థమైంది. 21అప్పుడు ఇశ్రాయేలు రాజు వాళ్ళను చూసి “నా తండ్రీ, వీళ్ళను చంపమంటావా, చంపెయ్యనా?” అని ఎలీషాని అడిగాడు.

22అప్పుడు ఎలీషా “నీవు వాళ్ళని చంపకూడదు. నీ వింటినీ, కత్తినీ ప్రయోగించి బందీలుగా పట్టుకున్న వాళ్ళను ఎలా చంపుతావు? వాళ్లకు రొట్టె, నీళ్ళూ ఇవ్వు. వారు తిని తాగి తమ రాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు” అన్నాడు. 23కాబట్టి రాజు వాళ్ళ కోసం విందు చేయించి అనేక రకాల భోజన పదార్థాలను తయారు చేయించాడు. వారు తిని తాగిన తరువాత వాళ్ళను తిరిగి తమ రాజు దగ్గరికి పంపించి వేశాడు. ఆ తరువాత సిరియా సైన్యం చాలా కాలం వరకూ ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టలేదు.