యూదా రాజైన యెహోరము
8:16-24; 2దిన 21:5-10, 20
16అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన అయిదో సంవత్సరంలో యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదా వాళ్ళపై రాజుగా పరిపాలన ప్రారంభించాడు. 17అతనికప్పుడు ముప్ఫై రెండేళ్ళు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.
18ఇతడు అహాబు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి ఇతడు ఇశ్రాయేలు రాజుల్లాగే వ్యవహరించాడు. అహాబు కుటుంబానికి చెందిన వాడిలా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు. 19కానీ యెహోవా తన సేవకుడైన దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు కనుక యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదు వారసులు యూదా రాజ్యాన్ని ఎన్నటికీ పరిపాలిస్తారని దేవుడు దావీదుకి ప్రమాణం చేశాడు.
20ఈ యెహోరాము పాలించిన రోజుల్లో ఎదోమీయులు యూదా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఒక రాజును తమ కోసం నియమించుకున్నారు. 21కాబట్టి యెహోరాము తన సైన్యాన్నీ, రథాలన్నిటినీ తీసుకుని ఎదోము సరిహద్దుల్లో ఉన్న జాయీరు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఎదోము సైన్యాలు వాళ్ళను చుట్టుముట్టాయి. కానీ యెహోరాము రాత్రివేళ తన సైనికులతో రథాలతో శత్రుసైన్యాల పంక్తులను ఛేదించుకుని తప్పించుకున్నారు. అప్పుడు అతని సైన్యం తప్పించుకుని తమ ఇళ్ళకు చేరుకున్నారు.
22కాబట్టి ఈ రోజు వరకూ ఎదోమీయులు యూదా పై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో లిబ్నా ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. 23యెహోరామును గూర్చిన ఇతర విషయాలకొస్తే, అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 24యెహోరాము చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. దావీదు పట్టణంలో అతని పూర్వీకులతో కూడా అతణ్ణి పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు అహజ్యా రాజు అయ్యాడు.


