యెజెబెలు మరణం
30యెహూ యెజ్రెయేలులో అడుగుపెట్టిన విషయం యెజెబెలుకు తెలిసింది. కాబట్టి ఆమె తన కళ్ళ చుట్టూ రంగులు వేసుకుని కేశాలంకరణ చేసుకుని మేడపైని కిటికీలోనుండి బయటకు తొంగి చూసింది. 31యెహూ గుమ్మం గుండా లోపలికి వస్తుండగా “జిమ్రీ వలే యజమానిని చంపినవాడా, శాంతి భావంతో వస్తున్నావా?” అని అడిగింది. 32అతడు తలెత్తి కిటికీ వైపు చూశాడు. “అక్కడ నా వైపు ఉన్నదెవరు?” అని అడిగాడు. ఇద్దరు ముగ్గురు నపుంసకులు కిటికీలోనుండి తొంగి చూసారు.
33యెహూ “ఆమెను కిందకు తోసెయ్యండి” అన్నాడు. వారు యెజెబెలుని కిందకు తోసేశారు. దాంతో ఆమె రక్తం గోడలమీదా, గుర్రాలమీదా చిమ్మింది. అప్పుడు యెహూ ఆమెను గుర్రాలతో తొక్కించాడు. 34తరువాత అతడు భవనంలో ప్రవేశించి భోజనం చేసిన తరువాత “శాపానికి గురైన ఆమె ఒక రాజ కుమార్తె. కాబట్టి వెళ్ళి ఆమెని సమాధి చేయండి” అని ఆదేశించాడు.
35సేవకులు ఆమెని సమాధి చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆమె పుర్రె, కాళ్ళు, అరచేతులూ తప్ప ఇంకేమీ కనపడలేదు. 36వారు వచ్చి యెహూకి ఆ సంగతి చెప్పారు. అప్పుడు అతడు “ఇది యెహోవా తన సేవకుడూ, తిష్బీ వాడూ అయిన ఏలీయా ద్వారా పలికిన మాట, ‘యెజ్రెయేలు నేలపై కుక్కలు యెజెబెలు మాంసాన్ని తిని వేస్తాయి. 37ఎవరూ గుర్తు పట్టలేకుండా ఆమె శరీరం యెజ్రెయేలు పొలాల్లో పేడలా ఉంటుంది’ ఆ మాట ప్రకారం ఇది జరిగింది” అన్నాడు.


