ఎలీషా మరణం

14ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.

15అప్పుడు ఎలీషా “విల్లంబులు తీసుకురా” అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు. 16“నీ చెయ్యి విల్లుపై వెయ్యి” అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి 17“తూర్పు వైపు కిటికీ తెరువు” అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా “బాణం వెయ్యి” అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు “ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు” అని చెప్పాడు. 18ఈసారి ఎలీషా “బాణాలు పట్టుకో” అని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో “నేలను కొట్టు” అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.

19అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి “నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు” అని చెప్పాడు.

20తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు. 21కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.

22యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు. 23అయితే యెహోవా వారిపై జాలిపడి దయ చూపి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి, వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ తన సముఖం లోనుండి వారిని వెళ్లగొట్టలేదు. 24సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానంలో రాజయ్యాడు.

25యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరచుకున్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరచుకున్నాడు.