ఏడవ తెగులు. వడగండ్లు
16నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి. 17నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు. 18ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.
19అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.” 20యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు. 21యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు. 22యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు.
23మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. 24ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు. 25ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. 26అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.
27ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం. 28ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను” అని వాళ్ళతో చెప్పాడు. 29మోషే అతనితో “నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు. 30అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు” అన్నాడు.
31ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి. 32గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు. 33మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.
34అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. 35యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.


