సమాజంలో బాధ్యతలు
16ఒకడు పెళ్లి నిర్ణయం కాని ఒక కన్యను లోబరచుకుని ఆమెతో తన వాంఛ తీర్చుకుంటే ఆమె కోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి. 17ఒకవేళ ఆమె తండ్రి ఆమెను అతనికిచ్చేందుకు నిరాకరిస్తే వాడు కన్యల కట్నం ప్రకారం సొమ్ము చెల్లించాలి.
18మంత్రగత్తెను బతకనివ్వకూడదు.
19జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలి.
20యెహోవాకు మాత్రమే బలులు అర్పించాలి, వేరొక దేవునికి బలి అర్పించే వాడు శాపానికి గురౌతాడు.
21పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
22విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు. 23వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను. 24నా కోపాగ్ని రగులుకొంటుంది. నా కత్తివేటుతో నిన్ను హతం చేస్తాను. మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.
25నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు. 26మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి. 27వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.
28నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.
29నీ మొదటి కోత అర్పణలు ఇవ్వడంలో ప్రథమ ఫలాలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. నీ కొడుకుల్లో మొదటివాణ్ణి నాకు ప్రతిష్టించాలి. 30అదే విధంగా నీ ఎద్దులు, గొర్రెలు అర్పించాలి. మీరు ప్రతిష్ఠించినవి మొదటి ఏడు రోజులు తమ తల్లి దగ్గర ఉన్న తరువాత ఎనిమిదవ రోజు నాకు ప్రతిష్ఠించాలి. 31మీరు నాకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు గనుక పొలాల్లో మృగాలు చీల్చిన జంతు మాంసం తినకూడదు. దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.”


