పరిమళ ధూప వేదిక

నిర్గ 37:25-28

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి. 2దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. 3దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.

4దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి. 5తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి. 6వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.

7అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి. 8అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.

9దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.

10అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.”

11యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు, 12“నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.

13జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.

14ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.

15విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.

16ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.”