ఇత్తడి గంగాళం

17యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. “నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి. 18సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి. 19ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.

20వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.

21వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”