అభిషేక తైలం, ధూపద్రవ్యం
22యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు, 23“నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్, 24నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి. 25పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.
26ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని, 27సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని, 28హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి. 29అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.
30అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.
31నీవు ఇశ్రాయేలు ప్రజలతో, ‘ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి. 32దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి. 33దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి’ అని చెప్పు.”
34యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు “నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి. 35పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.
36దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.
37నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి. 38దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.”


