మోషే కొత్త రాతి పలకలు తయారు చేశాడు.
ద్వితీ 10:1-5
1యెహోవా మోషేతో “మొదటి పలకల్లాంటి రాతి పలకలు మరో రెండు చెక్కు. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలు నేను ఆ పలకల మీద రాస్తాను. 2తెల్లవారేటప్పటికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి. 3ఏ మనిషీ నీతోబాటు ఈ కొండ దగ్గరికి రాకూడదు, ఏ మనిషీ ఈ కొండ మీద ఎక్కడా కనబడకూడదు. ఈ కొండ పరిసరాల్లో గొర్రెలు గానీ, ఎద్దులుగానీ మేత మేయకూడదు” అని చెప్పాడు.
4కాబట్టి మోషే మొదటి పలకల్లాంటి రెండు రాతి పలకలు చెక్కాడు. తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయాన్నే తొందరగా లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కాడు. 5యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.
6యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 7ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.
8మోషే వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు. 9“ప్రభూ, నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య మాతో ఉండి మాతో కలసి ప్రయాణించాలి. ఈ ప్రజలు మాటకు లోబడేవాళ్ళు కారు. మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు” అన్నాడు.


