నిబంధన వినూత్నం

నిర్గ 23:14-15; ద్వితీ 7:1-5; 16:1-17

10అందుకు ఆయన “ఇదిగో, నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకూ భూమిపై ఎక్కడైనా, ఏ ప్రజల్లోనైనా ఇంత వరకూ చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి. 11ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించు. నేను మీ ఎదుట నుండి అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొడతాను.

12మీరు వెళ్లబోయే ఆ పరదేశపు నివాసులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. అలా గనక చేసుకుంటే అవి మీకు ఉరిగా మారవచ్చు. 13అందువల్ల మీరు వాళ్ళ బలిపీఠాలను విరగగొట్టాలి, వాళ్ళ దేవుళ్ళ ప్రతిమలను పగలగొట్టాలి, వాళ్ళ దేవతా స్తంభాలను పడదోయాలి. 14మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను ‘రోషం గల దేవుడు’ అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి.

15ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి. 16మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్ళను పెళ్లి చేసుకోకూడదు. అలా గనక చేస్తే వాళ్ళ కూతుళ్ళు తమ తమ దేవుళ్ళను పూజిస్తూ మీ కొడుకులు కూడా వాళ్ళ దేవుళ్ళను పూజించేలా ప్రలోభ పెడతారేమో. 17పోత పోసిన దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకోకూడదు.

18పొంగజేసే పిండి లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టులో నుండి బయలుదేరి వచ్చారు గదా.

19జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెపిల్ల గానీ అది నాకు చెందుతుంది. 20గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రెపిల్లను అర్పించాలి. గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగగొట్టాలి. మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు.

21ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా. 22మీ పొలాల్లో పండిన గోదుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి. సంవత్సరం ముగింపులో పొలాలనుండి నీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకుని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి. 23సంవత్సరంలో మూడుసార్లు పురుషులంతా ఇశ్రాయేలియుల దేవుడు, ప్రభువు అయిన యెహోవా సముఖంలో కనబడాలి.

24మీరు సంవత్సరంలో మూడు సార్లు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సమకూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ నీ భూమిని స్వాధీనం చేసుకోరు. ఎందుకంటే నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్లగొట్టి నీ సరిహద్దులు విస్తరించేలా చేస్తాను.

25నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. పస్కా పండగలో అర్పించిన ఎలాటి మాంసమైనా ఉదయం దాకా నిలవ ఉండకూడదు. 26నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్టకూడదు.”

27యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు “ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.”