మానవ దుష్టత్వం

1మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు 2దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. 3యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.

4దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.

5మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. 6తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.

7కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.