నోవహు, అతని కుమారులు

18ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. 19వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.

20నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు. 21ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.

22అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు. 23అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.

24అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు.

25“కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. 26అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక.

కనాను అతనికి సేవకుడవుతాడు గాక.

27దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక.

అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు.

అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు.

28ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు. 29నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.