అబ్రాముకు దేవుని పిలుపు
1యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”
4యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు. 5అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.
6అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు. 7యెహోవా అబ్రాముతో “నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.
8అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు. 9అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు.


