ఏశావు తన జేష్టత్వం హక్కు వదులుకోవడం

27ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు. 28ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.

29యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు. 30ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది.

31అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు. 32అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు. 33యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు. 34యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.