యాకోబు రాహేలును కలుసుకోవడం
1యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు. 2అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది. 3అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు. 4యాకోబు వారిని చూసి “సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?” అని అడగ్గా వారు “మేము హారాను వాళ్ళం” అన్నారు. 5అతడు “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగితే వారు “అవును, మాకు తెలుసు” అన్నారు. 6“అతడు క్షేమంగా ఉన్నాడా?” అని అడిగినప్పుడు వారు “క్షేమంగానే ఉన్నాడు, అదిగో, అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తున్నది” అని చెప్పారు.
7అతడు “ఇదిగో, ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులను సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్ళు పెట్టి, పోయి వాటిని మేపండి” అని చెప్పినప్పుడు, 8వారు “మందలన్నిటినీ మళ్ళించే దాకా అది మా వల్ల కాదు. బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెడతాం” అన్నారు.
9అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకువచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది. 10యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు, అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని పెద్దగా ఏడ్చాడు. 11యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ, 12రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది. 13లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. 14అప్పుడు లాబాను “నిజంగా నువ్వు నా ఎముకవీ నా మాంసానివీ” అన్నాడు.
యాకోబు నెల రోజులు అతని దగ్గర నివసించిన తరువాత, 15లాబాను “నువ్వు నా బంధువ్వి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు” అని యాకోబును అడిగాడు. 16లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 17లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది. 18యాకోబు రాహేలును ప్రేమించి “నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
19అందుకు లాబాను “ఆమెని పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు” అని చెప్పాడు. 20యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.


