అమ్నోను తామారు
1దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే అందమైన చెల్లి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను తామారును గాఢంగా ప్రేమించాడు.
2అమ్నోనుకు తన చెల్లి తామారుపై ఉన్న వ్యామోహంతో అతడు అనారోగ్యం పాలయ్యాడు. ఆమె కన్య కాబట్టి ఆమెను ఏమైన చేయడం సాధ్యం కాదని అతనికి అనిపించింది.
3అమ్నోనుకు యెహోనాదాబు అనే ఒక సలహాదారుడు ఉన్నాడు. అతడు దావీదు అన్న షిమ్యా కుమారుడు. యెహోనాదాబు చాలా యుక్తిపరుడు. 4అతడు అమ్నోనును చూసి, “రాజకుమారుడవైన నీవు రోజు రోజుకు ఎందుకు చిక్కిపోతున్నావు? విషయమేంటో నాకు చెప్పవా?” అని అడిగాడు.
అమ్నోను అతనితో, “నేను నా సోదరుడైన అబ్షాలోము చెల్లి తామారును ప్రేమిస్తున్నాను” అన్నాడు.
5అందుకు యెహోనాదాబు, “నీకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ మంచం మీద పడుకో. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, ‘నా చెల్లి తామారు వచ్చి నాకు తినడానికి ఏదైనా ఇస్తే బాగుండేది. నా కళ్లముందు ఆమె భోజనం సిద్ధం చేసి, తన చేతితో నాకు తినిపించనివ్వండి’ అని నీ తండ్రితో చెప్పు” అన్నాడు.
6కాబట్టి తనకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ అమ్నోను పడుకున్నాడు. రాజు అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను, “నేను నా చెల్లి తామారు చేతితో తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం ప్రత్యేకంగా రెండు రొట్టెలు చేయమని చెప్పండి” అని అడిగాడు.
7కాబట్టి దావీదు తామారుకు, “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్లి, అతని కోసం భోజనం సిద్ధం చేయి” అని ఇంట్లో ఉన్న తామారుకు కబురు పంపాడు. 8తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్లింది. అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఆమె కొంత పిండి తీసుకుని కలిపి అతడు చూస్తుండగా రొట్టెలు చేసి కాల్చింది. 9ఆమె ఆ రొట్టెలు వడ్డిస్తూ ఉంటే అతడు తినడానికి ఒప్పుకోలేదు.
అమ్నోను, “అందరు బయటకు వెళ్లండి” అని చెప్పగానే అక్కడున్న వారందరు బయటకు వెళ్లిపోయారు. 10అప్పుడు అమ్నోను తామారుతో, “భోజనం నా పడకగదిలోనికి తెచ్చి నీ చేతితో తినిపించు” అన్నాడు. తామారు తాను తయారుచేసిన రొట్టెలు తీసుకుని పడకగదిలో ఉన్న తన అన్న అమ్నోను దగ్గరకు వచ్చింది. 11ఆమె అతనికి తినడానికి భోజనం తీసుకువచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, “నా చెల్లి, వచ్చి నాతో పడుకో” అన్నాడు.
12ఆమె, “అన్నా, వద్దు నన్ను బలవంతం చేయవద్దు! ఇశ్రాయేలులో ఇలాంటిది చేయకూడదు! ఈ దుర్మార్గపు పని చేయవద్దు. 13నేను ఏమైపోతాను? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఇశ్రాయేలీయులలో నీవు ఒక దుర్మార్గుడివి అవుతావు. రాజుతో మాట్లాడు. ఆయన నీకు నాతో పెళ్ళి చేయకుండా ఉండడు” అని చెప్పింది. 14కాని అతడు ఆమె మాట వినకుండా ఆమెను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు.
15తర్వాత అమ్నోనుకు ఆమె పట్ల విపరీతమైన ద్వేషం కలిగింది. ఇంతకుముందు ఆమెను ఎంత ప్రేమించాడో దానికన్నా ఎక్కువగా అతడు ఆమెను ద్వేషించాడు. అమ్నోను ఆమెతో, “లేచి వెళ్లిపో!” అన్నాడు.
16అందుకు ఆమె, “వద్దు, నీవు నన్ను బయటకు త్రోసివేస్తే అది నీవు నాకిప్పుడు చేసిన దానికన్నా పెద్ద తప్పు అవుతుంది” అని అన్నది.
కాని అతడు ఆమె మాట వినలేదు. 17అతడు తన వ్యక్తిగత సేవకుని పిలిచి, “ఈమెను నా దగ్గర నుండి వెళ్లగొట్టి, తలుపు గడియ వేయి” అని ఆజ్ఞాపించాడు. 18ఆ సేవకుడు ఆమెను బయటకు గెంటి తలుపు గడియ వేశాడు. కన్యలైన రాజకుమార్తెలు ధరించే ఒక అందమైన వస్త్రాన్ని తామారు ధరించి ఉంది. 19తామారు తన తలపై బూడిద వేసుకుని తాను వేసుకున్న వస్త్రాన్ని చింపుకుని తలమీద చేతులు పెట్టుకుని గట్టిగా ఏడుస్తూ వెళ్లిపోయింది.
20ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి, “నీ అన్న అమ్నోను కదా నీతో ఉన్నది? నా చెల్లీ, నెమ్మదిగా ఉండు; అతడు నీ అన్న. బాధపడకు” అన్నాడు. తామారు తన అన్న అబ్షాలోము ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయింది.
21ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు. 22అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.


