ధనం అర్థరహితం

8ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు. 9దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు.

10డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు;

సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు.

ఇది కూడా అర్థరహితము.

11ఆస్తి ఎక్కువవుతూ ఉంటే,

దాన్ని దోచుకునేవారు కూడా ఎక్కువవుతారు.

యజమానులకు తమ ఆస్తిని కళ్లతో చూడడం తప్ప,

దానివల్ల వారికేమి ప్రయోజనం?

12శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా,

సుఖంగా నిద్రపోతారు,

కానీ ధనికులకున్న సమృద్ధి

వారికి నిద్రపట్ట నివ్వదు.

13సూర్యుని క్రింద బాధాకరమైన ఒక చెడ్డ విషయాన్ని నేను చూశాను:

దాచి ఉంచిన సంపద యజమానునికి హాని తెస్తుంది,

14లేదా దురదృష్టవశాత్తూ వారి సంపద పోతుంది,

వారికి పిల్లలు కలిగినప్పుడు

వారికి వారసత్వంగా ఏమీ మిగలదు.

15ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే

దిగంబరిగానే వెళ్లిపోతారు.

తాము కష్టపడిన దానిలో నుండి వారు

తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.

16మరొక చెడ్డ విషయం:

ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు,

వారు గాలికి ప్రయాసపడుతున్నారు

కాబట్టి వారు ఏమి పొందుతారు?

17వారు చాలా నిరాశతో, బాధలతో, కోపంతో,

తమ దినాలన్ని చీకటిలో భోజనం చేస్తారు.

18నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా: దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని, త్రాగుతూ సూర్యుని క్రింద తాను చేసిన శ్రమతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే ఇదే వారు చేయవలసింది. 19అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము. 20దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు.

1నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది. 2దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే.

3ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము. 4గర్భస్రావమైన పిండం నిరుపయోగంగా వచ్చి చీకటిలోకి వెళ్లిపోతుంది, చీకటిలో దాని పేరు కప్పబడుతుంది. 5అది ఎన్నడు సూర్యుని చూడకపోయినా దానికి ఏమి తెలియకపోయినా, ఆ మనిషి కన్నా దానికే ఎక్కువ విశ్రాంతి ఉంది. 6అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా?

7మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే,

అయినా వారి ఆశకు తృప్తి కలగదు.

8మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది?

ఇతరుల ఎదుట ఎలా జీవించాలో

తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి?

9కోరిక వెంట పడడం కంటే

కళ్లకు కనిపించేది మేలు.

అయినా ఇది కూడా అర్థరహితమే.

గాలికి ప్రయాసపడడమే.

10ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే.

మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే;

తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు.

11మాటలు ఎక్కువ

అర్థం తక్కువ,

దానివల్ల ఎవరికి ప్రయోజనం?

12నీడలా తమ జీవితకాలాన్ని అర్థరహితంగా గడిపే మనుష్యుల బ్రతుకులో వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? వారు గతించాక సూర్యుని క్రింద భూమి మీద ఏం జరుగుతుందో వారికి ఎవరు చెప్తారు?