బాల్యంలోనే మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి
7వెలుగు ఆహ్లాదకరమైనది,
సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.
8ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే,
అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి.
అయితే చీకటి రోజులు చాలా
రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి.
రాబోయేదంతా అర్థరహితమే.
9యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి,
మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి
మీ హృదయ కోరుకున్న వాటిని
మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి,
కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని
తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి.
10కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి,
మీ శరీర బాధలను వెళ్లగొట్టండి,
ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే.
1-2కష్ట దినాలు రాకముందే
“వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే
సంవత్సరాలు రాకముందే,
సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే,
వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే,
నీ యవ్వన ప్రాయంలో
నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
3ఆ రోజు ఇంటి కావలివారు వణుకుతారు,
బలిష్ఠులు వంగిపోతారు,
తిరగలి విసిరేవారు కొంతమందే ఉండడంతో పని ఆపివేస్తారు,
కిటికీలో నుండి చూచేవారి దృష్టి మందగిస్తుంది.
4వీధి తలుపులు మూసేస్తారు;
తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది
పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు,
పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి.
5మనుష్యులు ఎత్తైన స్థలాలకు
వీధుల్లో అపాయాలకు భయపడతారు;
బాదం చెట్టు పూలు పూస్తుంది
మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు
ఇక కోరికలు రేపబడవు.
మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు
వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు.
6వెండితాడు తెగిపోక ముందే,
బంగారు గిన్నె పగిలిపోక ముందే,
నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే,
బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే,
నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
7మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది,
ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.
8“అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి.
“ప్రతిదీ అర్థరహితమే!”


