యెరూషలేము స్త్రీలు
9ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా,
లేచి నా మాట వినండి;
భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా,
నేను చెప్పే మాట వినండి!
10ఇక ఒక సంవత్సరంలో,
భద్రంగా ఉన్న మీరు భయంతో వణుకుతారు;
ద్రాక్ష పంట పడిపోతుంది.
పండ్లు పంటకు రావు.
11ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా వణకండి;
భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, వణకండి
మీ మంచి బట్టలు తీసివేసి
మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.
12ఆహ్లాదకరమైన పొలాల గురించి ఫలించే ద్రాక్షతీగెల గురించి
మీ రొమ్ము కొట్టుకోండి.
13నా ప్రజల భూమిలో
గచ్చపొదలు, ముళ్ళచెట్లు పెరుగుతాయి.
ఆనందోత్సాహాలతో ఉన్న ఇళ్ళన్నిటి కోసం
ఉల్లాసంతో ఉన్న ఈ పట్టణం కోసం దుఃఖించండి.
14కోట విడిచిపెట్టబడుతుంది
కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది;
కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి,
అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా,
మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,
15పైనుండి మామీద ఆత్మ కుమ్మరించబడేవరకు ఇలా ఉంటాయి.
తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిలా,
ఫలభరితమైన భూమి అడవిగా మారుతాయి.
16అప్పుడు యెహోవా న్యాయం అరణ్యంలో నివసిస్తుంది,
ఆయన నీతి ఫలభరితమైన భూమిలో ఉంటుంది.
17సమాధానం ఆ నీతి యొక్క ఫలంగా ఉంటుంది;
దాని ఫలితంగా నెమ్మది భద్రత నిత్యం కలుగుతాయి.
18అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో
సురక్షితమైన ఇళ్ళలో
ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.
19వడగండ్లు అడవిని నాశనం చేసినా
పట్టణం పూర్తిగా నేలమట్టమైనా,
20మీరు ఎంతో ధన్యులై ఉంటారు,
మీరు నీటి ప్రవాహాల ఒడ్డులన్నిటి దగ్గర మీ విత్తనాలు చల్లుతూ,
మీ పశువులను గాడిదలను స్వేచ్ఛగా తిరగనిస్తారు.


