యేసు రూపాంతరం చెందుట
1ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును తన వెంట తీసుకుని ఒంటరిగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్లారు. 2అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి. 3అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు.
4అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, మనం ఇక్కడే ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు.
5అతడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం వారిని కమ్ముకుని ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఈయన మాటలను వినండి!” అని చెప్పడం వినిపించింది.
6శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. 7కానీ యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి, “లేవండి, భయపడకండి” అని చెప్పారు. 8వారు లేచి చూసినప్పుడు, అక్కడ వారికి యేసు తప్ప ఇంకెవరు కనబడలేదు.
9వారు కొండ దిగి వస్తున్నప్పుడు, “మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు” అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.
10అప్పుడు శిష్యులు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు.
11అందుకు యేసు, “ఏలీయా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే. 12ఏలీయా ముందే వచ్చాడు కాని ఎవరు అతన్ని గుర్తించలేదు, వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు. మనుష్యకుమారుడు కూడ అలాగే వారి చేత హింసను పొందబోతున్నాడని మీతో చెప్తున్నాను” అన్నారు. 13యేసు తమతో చెప్తున్నది బాప్తిస్మమిచ్చే యోహానును గురించి అని శిష్యులు అర్థం చేసుకున్నారు.


