అధికారుల అధికారానికి లోబడుట
1దేవుడు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కాబట్టి ప్రతీ వ్యక్తి తన పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. 2కాబట్టి ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తున్నారో వారు దేవుడు నియమించిన దాన్ని ఎదిరిస్తున్నారు. అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు. 3మంచి పనులు చేసేవారిని పరిపాలకులు భయపెట్టరు; అయితే తప్పు చేసే వారికే వారంటే భయం. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలంటే మీరు మంచి పనులు చేయాలి. 4మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు. 5కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండాలి.
6అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము. 7మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి.


