Select a Verse

కీర్తన 5

సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన.

1యెహోవా, నా మాటలు ఆలకించండి,

నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.

2నా రాజా నా దేవా,

సాయం కోసం నేను చేసే మొరను వినండి,

మీకే నేను ప్రార్థిస్తున్నాను.

3యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు;

ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి

ఆశతో వేచి ఉంటాను.

4మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు;

చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు.

5అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు;

చెడు చేసేవారందరిని

మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని

6మీరు నాశనం చేస్తారు.

రక్తపిపాసులను మోసగాండ్రను,

యెహోవా అసహ్యించుకుంటారు.

7కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి

మీ మందిరంలోనికి రాగలను;

మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి

నేను భక్తితో నమస్కరిస్తాను.

8యెహోవా, నా శత్రువులను బట్టి

మీ నీతిలో నన్ను నడిపించండి.

మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.

9వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు.

వారి హృదయం అసూయతో నిండి ఉంది.

వారి గొంతు తెరిచిన సమాధి;

వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.

10ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి,

వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి.

వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి,

వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

11అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు;

వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు.

మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా,

మీరు వారిని కాపాడండి.

12యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు;

డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు.